అధిక వడ్డీ ఇస్తామని రూ.10 కోట్ల మోసం.. శ్రేయ ఇన్ఫ్రా డైరెక్టర్ హేమంత్ కుమార్ రాయ్  సహా ముగ్గురి అరెస్ట్ 

అధిక వడ్డీ ఇస్తామని రూ.10 కోట్ల మోసం.. శ్రేయ ఇన్ఫ్రా డైరెక్టర్ హేమంత్ కుమార్ రాయ్  సహా ముగ్గురి అరెస్ట్ 
  • ట్రాన్సిట్ వారెంట్‌‌పై కరీంనగర్‌‌కు తరలింపు

కరీంనగర్, వెలుగు: అధిక వడ్డీలు, విలాసవంతమైన గిఫ్ట్ ల ఆశ చూపి 30 మంది నుంచి  రూ.10కోట్లు వసూలు చేసి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రేయ ఇన్ ఫ్రా అండ్  మార్కెటింగ్  ప్రైవేట్  లిమిటెడ్  డైరెక్టర్  హేమంత్ కుమార్  రాయ్ తో పాటు మరో ఇద్దరిని కరీంనగర్  పోలీసులు అరెస్ట్​ చేశారు. సీపీ కథనం ప్రకారం.. 2020లో ఉత్తరప్రదేశ్‌‌లోని లక్నోలో స్థాపించిన ఈ సంస్థ ద్వారా వివిధ స్కీమ్ లను ప్రారంభించి తమ సంస్థలో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలో రెండింతలు, మూడింతలు లాభాలు వస్తాయని నమ్మబలికారు.

తమ ఏజెంట్ల ద్వారా నెట్‌‌వర్క్  చైన్  విధానంలో కొత్త సభ్యుల(పెట్టుబడిదారులు) నుంచి సేకరించిన మొత్తాలతో పాత సభ్యులకు డబ్బులు చెల్లిస్తూ మరింత మంది సభ్యులుగా చేరి పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించారు. కొంతకాలం చెల్లింపులు చేసిన వారు 2024 మే నుంచి చెల్లింపులు నిలిపివేశారు. ఈ వ్యవహారంపై కరీంనగర్ కు చెందిన బాధితుడు గుగులోత్  శివరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్  వన్ టౌన్  పోలీస్ స్టేషన్‌‌లో కేసు నమోదు కాగా, సీపీ ఆదేశాల మేరకు కేసును సీసీఎస్  కరీంనగర్‌‌కు బదిలీ చేశారు.

కరీంనగర్  సీసీఎస్  సీఐ ఆర్.ప్రకాశ్ గౌడ్  ఆధ్వర్యంలో స్పెషల్  టీమ్  యూపీ వెళ్లి ఈ నెల 18న రాత్రి లక్నోలో హేమంత్ కుమార్  రాయ్, రాజేశ్ కుమార్, బ్రిజేశ్ కుమార్ మిశ్రాను అదుపులోకి తీసుకుంది. నిందితులను ట్రాన్సిట్  వారెంట్‌‌పై కరీంనగర్‌‌కు తరలించారు. కేసును ఛేదించడంలో కీలకంగా పని చేసిన సీసీఎస్  ఇన్‌‌స్పెక్టర్  ఆర్.ప్రకాశ్ గౌడ్, ఎస్సై డి. మహిపాల్ రెడ్డి, సిబ్బందిని సీపీ గౌష్  ఆలం అభినందించారు. బాధితులు సమీప పోలీస్ స్టేషన్  లేదంటే కరీంనగర్  సీసీఎస్ లో సంప్రదించాలని సీపీ సూచించారు.